Sunday, 14 December 2014

letter

                                                                                                రాయచూరు
                                                                                                 15.12.14 

ప్రియాతిప్రియమైన  మిత్రులు  తెలుగు విద్యార్ధి  గారికి  మీ మిత్రుడు  కొల్లూరి వెంకట కృష్ణా రావు వ్రాయు   లేఖార్ధములు, ఇక్కడ మేమంతా  క్షేమం గానే  ఉన్నాం , మీ క్షేమ సమాచారం  తెలుపగోరతాము .
 మీ పిత్రుసమానులైన  కొల్లూరి  కోటేశ్వరరావు గారు , స్వర్గస్తులైన  వెంటనే  మీకు ఉత్తరం రాయాలి అనుకున్నాను , జరా మరణములు  సహజములే  , మీలాంటి  సాహితి  పుత్రులను   కలిగిన  కోటేశ్వరరావు గారు  అమరులే , ఈ విషయాన్నీ  మీకు వ్రాసే  అంతటి   పెద్దవాడిని  కాకపోయినా ఏదో నాకు తెలిసిన విధంగా వ్రాస్తున్నాను , కార్డు కొరకు చాలా రోజులనుండి  ప్రయత్నిస్తే,   ఉత్తరాలు  రాసే రోజులు ఎప్పుడో పోయాయి , కార్డ్లు  కవర్లు  లేవు  మెయిలు పంపండి తాతగారు  అంటూ  నా మనమరాలు చిన్న సలహా ఇచ్చింది.
అయ్యా పిల్లకాకి  దానికేం తెలుసు ఉత్తరాల మహిమ , మా చిన్నప్పుడు  చెట్టు పై కాకి అరిస్తే  చుట్టా లైనా రావాలి  , ఉత్త రాలైనా  రావాలి  అని ఎదురు చూసే వాళ్ళం , ఉత్తరం వస్తే ఆనందం , చుట్టాలొస్తే  పరమానందంగా  ఉండేది , ఆ విషయాలు వారికి చెప్పినా అర్ధం కావు  , అంతే  కాదు  ఫలానా రోజు వస్తున్నాం  అని ఉత్తరం వ్రాసి  దూరప్రాంత నగరాలనుండి  వస్తున్న చుట్టాలకొరకు  ఎదురు చూస్తూ  వారు వచ్చే నాటికి ఏమేమి  వంటకాలు చెయ్యాలి అని ఆలోచించే వాళ్ళం , జున్ను పాల కొరకు  ఎవరి  ఆవు  ఈతకు వచ్చిందో తెలుసుకునే వాళ్ళం , ఉలవలు ఎవరెవరు  ఎడ్లకు  పెడుతున్నారో  తెలుసుకునే వాళ్ళం , ఎందుకంటే  పట్నం నుండి వచ్చే చుట్టాలకు ఉలవచారు  రుచి  చూపించాలి కదా , ఇలాంటి  ప్రయత్నాలు  చేస్తూ  ఎంతో సంబరంగా  ఆ రాబోయే చుట్టాల రాక కొరకు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం , అంతే  కాదండోయి , ప్రక్క ఊళ్ళో ఉన్న మా  బంధువులకు  ఈ విషయం తెలియజేస్తే  వచ్చిన భందువుల్ని  వారింటికి కూడా తీసుకు వెళ్ళే ఏర్పాట్లు  చేసుకునే వారు , అదే  భందువుల  సంఖ్య ఎక్కువ ఉంటె , వచ్చినవారు తక్కువ రోజులు ఉండేటట్టు  అయెతే , పూటకు  ఒకరి చొప్పున  వార్ని  విందుకు ఆహ్వానించే వారు ,
అయ్యా ... తెలుగు విద్యార్ధి గారు,  పూర్వం  మీలాంటి  సారస్వత పుత్రులను చదివి , మా అభిప్రాయాలను   వ్రాస్తే   వచ్చే సంచిక లో  మా పేరు వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ , రాక పొతే నిరాశ చెందక  , మళ్ళి  మళ్ళి వ్రాస్తూ  సంవత్సరాల తరబడి ఉత్తరాలు రాసేవాళ్ళం , వారి దయతో  మా పేరు ప్రచురిoచ బడితే  జన్మ ధన్యమైనట్టుగా  భావించి  ఆ పత్రిక ను   అపురూపంగా చూస్తూ అడిగినవారికి , అడగని వారికి చూపిస్తూ  పరమానంద పడి పోయేవాళ్ళం , ఆ రోజులు  పోయాయి , ఇప్పుడంతా  ఇంటర్నెట్ , ఫేస్బుక్ , ఈ మెయిల్స్ , క్షణాలలో  ప్రపంచమంతా  తెలిపే  సాధనాలు   వచ్చేశాయి  తాత గారు  అంటూ  నా మనవరాలు  అంటుంటే  నా మనసు అంగీకరించక , అదేంటమ్మ  పత్రికలలో చాలా  ఉత్తరాలు రాస్తూ ఉంటారు కదా అని అంటే , అవన్నీ  బహుమతుల ఆశచూపి పత్రికల వారు రాయించుకునే  ఉత్తరాలు తాతగారు అంటూ , ఒక పత్రిక లో రెండు బొమ్మలు వేసి తేడాలు కనిపెట్టి రాస్తే 500 బహుమతి,  సరిగ్గా వ్రాసిన  ఉత్తరాలలో డ్రా తీసి  ముగ్గురికి సమానంగా బహుమతిని  పంపుతాము అంటూ  ఆశ చూపి  రాయించుకునే  ఉత్తరాలే  తాతగారు  అంటూ నా  మనవరాలు  ఉత్తరాన్ని  చిన్న చూపు  చుస్తే చూడవచ్చు  కాని నేను మాత్రం  మీకు  ఉత్తరాలు రాస్తూనే ఉంటాను , మీరు కూడా విసుగు చెందక  తప్పక చదవగలరు అని ఆశిస్తున్నాను , నాన్నగారి ఆత్మకు శాంతి చేకూర్చాలి అని ఆ భగవంతుడిని  ప్రార్ధిస్తున్నాను , మన మిత్రులు అందరిని  అడిగినట్టు  చెప్పగలరు , ఈ ఉత్తరం అందిన వెంటనే  మీ అందరి యోగక్షేమాలతో   ఉత్తరం రాయగలరు , మీ ఉత్తరం కొరకు వేయి  కళ్ళతో  ఎదురు చూస్తుంటాను , నేను పెద్దగా చదువుకొని  సంగతి  మీకు తెలుసు  , ఈ ఉత్తరంలో ఏమైనా  తప్పులు ఉంటె  మన్నించగలరు .
ఇట్లు
భవదీయుడు
కొల్లూరి వెంకట కృష్ణా రావు , రాయచూరు , కర్ణాటక

   

No comments:

Post a Comment